ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పరిశ్రమలకు భూ కేటాయింపులపై వివాదాలు ఆగడం లేదు. ఇటీవల ఊరుపేరు లేని ‘ఉర్సా’ (Ursa) కంపెనీ (Company)కి ప్రభుత్వం రాయితీలు అని జరిగిన రచ్చ జరిగిన నేపథ్యంలో, ఇప్పుడు మరో భూ కేటాయింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం రూ.10 లక్షల మూలధనంతో ఢిల్లీ (Delhi)లో స్థాపించబడిన వోల్ట్‌సన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ (Voltson Lab Private Limited)కు చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) వందల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కేటాయిస్తోందన్న అంశం చర్చనీయాంశమైంది. రెండు నెలల క్రితం పుట్టిన ఈ కొత్త కంపెనీ రూ.1,504 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించగా, ప్రభుత్వం 69% రాయితీల రూపంలో తిరిగి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎంపీసెజ్‌లో ఎకరం రూ.60 లక్షల చొప్పున 37 ఎకరాలు కంపెనీకి కేటాయించింది. అయితే అదే ప్రాంతంలో భూముల మార్కెట్ విలువ ఎకరానికి రూ.5 కోట్లకు పైబడుతుందని స్థానికులు చెబుతున్నారు. కంపెనీ సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ కోసం 2 గిగావాట్ల సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ ప్రతిపాదనలు సమర్పించగా, అనుభవం లేని కంపెనీకి ప్రభుత్వం ఇంత భారీ రాయితీలు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది.
మొత్తం పెట్టుబడిలో ‘ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’గా పేర్కొన్న రూ.1,504 కోట్లలో, ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు, వాటర్ ఛార్జ్ సబ్సిడీలు, స్టాంప్ డ్యూటీ రాయితీలు కలిపి మొత్తం రూ.1,037.86 కోట్ల రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాదు, క్యాపిటివ్ సోలార్ యూనిట్, వాటర్ సప్లై వంటి అదనపు మౌలిక వసతులనూ కల్పించనుంది. రెండు నెలల క్రితం పుట్టిన కంపెనీకి ఒక్కసారిగా ఇలాంటి భారీ ఆర్థిక ప్రయోజనాలు అందజేయడం అధికార వర్గాల్లో కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ కంపెనీని ఆగస్టు 22న కమలేష్ కుమార్ జైన్, ప్రదీప్ కుమార్ జైన్‌లు స్థాపించారు. ఇద్దరికీ సోలార్ రంగంలో అనుభవం లేకపోవడం, ఎయిర్ కండిషనింగ్ వ్యాపారంతో మాత్రమే సంబంధం ఉండటం ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కంపెనీ ఏర్పడి రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఇంతటి భారీ భూకేటాయింపు, రాయితీలు ఇవ్వడంలో ఏదో బలమైన ప్రాభవం పనిచేస్తోందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో, పరిశ్రమల భూ కేటాయింపులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కొత్త ప్రశ్నలు లేవుతున్నాయి.









