విశాఖపట్నంలో జీవీఎంసీ చేపట్టిన “ఆపరేషన్ లంగ్స్”పై చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. స్ట్రీట్ వెండర్స్ అంతా రోడ్ల మీదకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. లక్షల మెజార్టీ ఇచ్చి కూటమి అభ్యర్థుల గెలిపించిన ఓటర్లే నేడు కూటమి పెద్దలను నోటికొచ్చినట్లుగా తిడుతూ శాపనార్థాలు పెడుతున్నారు. విశాఖలో చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేతలకు జనసేన నాయకుడే కారణమని తాజాగా ఓ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి హైకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా నగరంలోని బడ్డీలు, తోపుడు బండ్లు, చిరు దుకాణాల తొలగింపులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. పీతల మూర్తి వేసిన పిటిషన్ వల్లే ఈ తొలగింపులు జరిగాయని, సామాన్యుల జీవనోపాధిపై నేరుగా దెబ్బపడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన కార్పొరేటర్ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఈనెల 24వ తేదీ వరకు గడువిచ్చింది. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అమలుపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో జీవీఎంసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, నిజంగా చిరువ్యాపారులకు హాకర్స్ జోన్లు ఏర్పాటు చేసి, స్ట్రీట్ వెండర్ ఐడెంటిటీ కార్డులు ఇవ్వాల్సింది జీవీఎంసీ. కానీ ఆ బాధ్యత నుండి తప్పించుకోవడానికే ఆపరేషన్ లంగ్స్ పేరుతో తొలగింపులు చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన జీవీఎంసీ, ఆపరేషన్ లంగ్స్ పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించడం అర్థంలేనిదని స్థానికులు మండిపడుతున్నారు. చిరు వ్యాపారులకు బదులుగా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మొత్తానికి, కూటమి ప్రభుత్వం సామాన్యుల వైపు నిలవడం లేదని, పీతల మూర్తి పిటిషన్‌తోనే స్పష్టమైందని ప్రజల అభిప్రాయం.







