విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) కార్డియాలజీ విభాగంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డేటా ఎంట్రీ రూమ్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం సిబ్బంది గమనించడంతో వెంటనే అలర్ట్ అయ్యారు. మంటలు విస్తరించే ముందే వాటిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, కొన్ని టేబుళ్లు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా నియంత్రించారు.
ఈ ఘటనపై KGH సూపరింటెండెంట్ స్పందిస్తూ.. అగ్ని ప్రమాదం సమయంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని వెల్లడించారు. ‘‘మొత్తం 43 మంది రోగులను వెంటనే ఇతర వార్డులకు షిఫ్ట్ చేశాం. మంటలు ఆర్పే చర్యలు కొనసాగుతూనే రోగులన్ని సురక్షితంగా తరలించగలిగాం’’ అని తెలిపారు. ఫైర్ సిబ్బంది సమయానికి వచ్చి పరిస్థితిని నియంత్రించారని చెప్పారు.
KGH ఆర్‌ఎమ్‌ఓ బంగారయ్య మాట్లాడుతూ.. ‘‘డేటా ఎంట్రీ రూమ్ వైపు నుంచి పొగలు రావడం గమనించాం. వెంటనే సిబ్బంది మంటలను అణచివేయడానికి ప్రయత్నించారు. తర్వాత వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చాం. రోగులందరినీ సురక్షితంగా తరలించాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు’’ అని వివరించారు. అధికారుల వేగవంతమైన చర్యలతో భారీ ప్రమాదం తప్పింది.








