ల‌క్ష‌ల మెజార్టీ ఇచ్చినందుకు బ‌హుమాన‌మా..?

ల‌క్ష‌ల మెజార్టీ ఇచ్చినందుకు బ‌హుమాన‌మా..?

రెక్కాడితే గానీ.. డొక్కాడ‌ని కుటుంబాల బ‌తుకులు రోడ్డున‌ప‌డ్డాయి. లక్షల మెజారిటీతో కూట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించిన త‌మ‌కు కూట‌మి ప్రభుత్వం ఇస్తున్న బహుమానం ఇదేనా..? అని విశాఖ‌లోని రోడ్ సైడ్ ఫుడ్ వ్యాపారులు గ‌గ్గోలు పెడుతున్నారు. హైద‌రాబాద్‌లో హైడ్రా (Hydra)  త‌ర‌హాలో విశాఖ‌లో ఫుడ్ స్ట్రీట్‌పైకి జీవీఎంసీ అధికారులు బుల్డోజ‌ర్లు పంపించారు. ముద్ర లోన్లు, వ‌డ్డీ వ్యాపారుల వ‌ద్ద అప్పులు తెచ్చుకొని రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకుంటున్న వారి గుండెల‌పై జీవీఎంసీ వారి ప‌దునైన జేసీబీ దంతాలు దిగుతున్నాయి. విశాఖలో జీవీఎంసీ ఆధ్వర్యంలో “ఆపరేషన్ లంగ్స్” (Operation Lungs) పేరుతో రోడ్‌సైడ్ షాపుల తొలగింపులు చేప‌డుతున్నారు. జీవీఎంసీ వారి కార‌ణాలు వారికి ఉన్న‌ప్ప‌టికీ, ఆ షాపుల ద్వారా పిల్ల‌ల‌ను పోషించుకుంటున్న కుటుంబాలు క‌న్నీరు పెడుతున్నాయి.

ముంద‌స్తు సమాచారం ఇవ్వ‌కుండా త‌మ జీవితాల‌ను రోడ్డున ప‌డేస్తున్నార‌ని షాపుల నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “మమ్మల్ని రోడ్డుపై పడేస్తున్నారు. మా పొట్ట కొట్టడం సూపర్ సిక్స్ పథకంలో భాగమా.. మీ స్పెష‌ల్ ఫ్లైట్‌ల ఖ‌ర్చు అంత కూడా ఉండ‌దు మా బ‌తుకులు.. ఓట్లు వేసినందుకు మాకు తగిన బుద్ది చెప్పారు. మేము పిల్లల‌తో ఎలా బ్రతకాలి..? గతంలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు లేవు.. స్మార్ట్ సిటీ పేరుతో మా పొట్ట కొడుతున్నారు.. అధికారులను బ్రతిమలాడినా వినిపించుకోలేదు.. అప్పులు చేసి షాపులు పెట్టుకుంటే ధ్వంసం చేశారు. మాకు ప్రభుత్వమే దారి చూపించాలి” అని చిరు వ్యాపార‌స్తులు గ‌గ్గోలు పెడుతున్నారు.

“గ‌వ‌ర్న‌మెంట్‌ (Government)కు తెలియ‌కుండా ఏమీ జ‌ర‌గ‌దు.. మాపై ఇంత ప‌గ ఎందుకు.. మా బ‌తుకులు రోడ్డు మీద ప‌డేస్తున్నారు” అని మండిప‌డుతున్నారు. స్థానికులు, చిరు వ్యాపారులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రోడ్డు ప‌క్క‌న‌ షాపుల తొల‌గింపు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌ను ప్రోత్స‌హించి, షెల్ట‌ర్ల ఏర్పాటుకు దోహ‌దప‌డింద‌ని, అందుకే గ‌త ప్ర‌భుత్వ జ్ఞాప‌కాలు ఉండ‌కూడ‌ద‌నే జీవీఎంసీ (GVMC) వాటి తొల‌గింపున‌కు చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని కొంద‌రు వ్యాపారులు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలోనూ తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. గ‌త ప్ర‌భుత్వం విశాఖ‌ (Visakha)ను ఎగ్జిక్యూటీవ్ క్యాపిట‌ల్ (Executive Capital) చేసేందుకు ప్ర‌తిపాదిస్తే.. క్యాపిట‌ల్‌ను సైతం వ‌దులుకొని కూట‌మి నేత‌ల‌కు ల‌క్ష‌ల మెజార్టీ క‌ట్ట‌బెట్టిన వారిపై క‌నిక‌రం లేదా..? కాస్త‌ చూపండి అంటూ పోస్టులు పెడుతున్నారు. కొంద‌రు మాత్రం కూట‌మికి ఓట్లు వేశారుగా అనుభ‌వించండి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జీవ‌నోపాధిని దూరం చేసిన ప్ర‌భుత్వంపై చిరు వ్యాపారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment