రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోమాంసం ఎపిసోడ్ రోజురోజుకూ కొత్త విషయాలను బయటపెడుతూ షాక్‌కు గురిచేస్తోంది. విశాఖ (Visakhapatnam)లోని ఓ కోల్డ్ స్టోరేజ్‌లో డీఆర్ఐ (DRI) అధికారులు 1.89 లక్షల కిలోల గోమాంసం (Beef) స్వాధీనం చేసుకున్న ఘటన పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనలో టీడీపీ(TDP) బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ (Narendra Varma) అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా (Subrahmanyam Gupta) కీలకపాత్ర పోషించినట్టు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
తాజాగా ఈ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోమాంసం విశాఖ కేంద్రంగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు మైనారిటీల పేరుతో టీడీపీ నేత సుబ్రహ్మణ్యం గుప్తా రవాణా లైసెన్స్ తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. బాపట్లలోని ఇస్లాంపేటకు చెందిన ఓ ముస్లిం వ్యక్తి పేరుతో లైసెన్స్ తీసుకుని, ఆ లైసెన్స్ ఆధారంగా సౌదీ, ఖతార్, బెహరేన్ వంటి దేశాలకు గోమాంసం ఎగుమతి చేసినట్టు సమాచారం. ఈ వ్యాపారం వెనుక సుబ్రహ్మణ్యం గుప్తా అండ్ కో.. ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత కొన్నేళ్లుగా సుబ్రహ్మణ్యం గుప్తా, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కలిసి లిక్కర్, పెట్రోల్, హెచరీస్ వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గోమాంసం వ్యవహారం బహిర్గతం కావడంతో ఈ వ్యాపార సంబంధాలు మరింత చర్చకు దారి తీసాయి. డీఆర్ఐ స్వాధీనం చేసుకున్న గోమాంసం నిల్వలు టీడీపీ నేత ఆధీనంలోని కోల్డ్ స్టోరేజ్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పవన్, ఎందుకు మౌనం..?
ఇదిలా ఉండగా, ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు పురందేశ్వరి, భానుప్రకాశ్ రెడ్డి మౌనంగా ఉండటాన్ని హిందూ సంఘాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సనాతన ధర్మం గురించి తరచూ వ్యాఖ్యలు చేసే పవన్ కళ్యాణ్.. లక్షల కిలోల గోమాంసం పట్టుబడిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ కేంద్రంగా ఇంత పెద్ద అక్రమ దందా కొనసాగుతున్నా.. ఎందుకు నోరుమెదపడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ జగన్ హయాంలో జరిగి ఉంటే..
ఇదే వైఎస్ జగన్ హయాంలో జరిగి ఉంటే టీవీల్లో నిరంతరం ఇదే ప్రసారం జరిగేదని, పేపర్ల నిండా ఇదే వార్త అచ్చేసేవారని, సాయంత్రం డిబేట్లు పెట్టి నానా యాగీ చేసేవారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధార్మిక సంఘాల ముసుగులో ఉన్న కొందరు రాజకీయ నాయకులంతా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టి వైఎస్ జగన్‌ను తూలనాడుతూ పెద్ద వివాదమే సృష్టించేవారంటున్నారు. మెజార్టీ మీడియా ఛానళ్లు, పత్రికలు అధికార పార్టీకి చెందినవి కావడంతో ఈ విషయంలో సివియారిటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.








