‘తమాషాగా ఉందా?’.. విశాఖ ఉత్స‌వ్‌లో క‌లెక్ట‌ర్‌పై రెచ్చిపోయిన మేయ‌ర్ (Video)

'తమాషాగా ఉందా?'.. విశాఖ ఉత్స‌వ్‌లో క‌లెక్ట‌ర్‌పై రెచ్చిపోయిన మేయ‌ర్ (Video)

విశాఖ ఉత్సవ్ (Vizag Utsav) ప్రారంభోత్సవం వేదికగా ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. నగర మేయర్ (City Mayor) పీలా శ్రీనివాసరావు (Peela Srinivasa Rao), జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ హరేందిరప్రసాద్ (Harendira Prasad) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విశాఖ ఉత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో వేదికపై కూర్చోవడం విషయంలో కలెక్టర్ మేయర్‌ను కొద్దిగా పక్కకు కూర్చోగలరని సూచించినట్లు సమాచారం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ తీవ్రంగా స్పందించారు.
“నేను నగర ప్రథమ పౌరుడిని. నన్ను కూర్చున్న చోటు నుంచి లేపి పక్కకు వెళ్లమంటావా? ప్రొటోకాల్ అంటే ఏంటో తెలుసా?” అంటూ కలెక్టర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మంత్రుల సమక్షంలోనే హడావుడి
ఈ ఘటన హోంమంత్రి అనిత (Anitha) సమక్షంలోనే జరిగింది. మేయర్ ఒక్కసారిగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కలెక్టర్ జోక్యం చేసుకుని, తన మాటలను వేరే ఉద్దేశంతో అనలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ మేయర్ శాంతించలేదు.“తమాషాగా ఉందా?” అంటూ కలెక్టర్‌పై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మంత్రులు దుర్గేష్, వీరాంజనేయస్వామి, అనిత కలెక్టర్‌ను మాత్రమే వారించారే తప్ప మేయర్‌ను నిలువరించే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మేయర్ మరింత రెచ్చిపోయి వేదికపై హడావుడి చేశారు.

ఉద్రిక్త క్షణాలు
“రండి… కూర్చోండి” అంటూ కలెక్టర్ మేయర్‌ను బతిమిలాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మేయర్ కలెక్టర్ చేతులను బలంగా నెట్టేసి, వేలు చూపిస్తూ హెచ్చరికలు జారీ చేసినట్లు వీడియోల్లో కనిపిస్తోంది.
“నేను వెళ్లిపోతానులెండి… ఏం మాట్లాడుతున్నావయ్యా?” అంటూ మేయర్ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయారు. ఈ పరిణామంతో కలెక్టర్ నిశ్చేష్టుడయ్యారు. వేదికపై ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ వివాదాన్ని సమర్థవంతంగా అడ్డుకోలేకపోవడంతో కలెక్టర్ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లి కొద్దిసేపు తన కారులో కూర్చున్నారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్‌తో ప్రజాప్రతినిధి ఈ స్థాయిలో వ్యవహరించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రొటోకాల్ గౌరవం, ప్రజాస్వామ్య విలువలపై ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment