విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, డైరెక్టర్లు 12 మంది, ఆనంద్ సోదరి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాకుమారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సమక్షంలో వారు బీజేపీలో చేరారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి పురందేశ్వరి కండువాలు వేసి సాదరంగా స్వాగతం పలికారు. ఆనంద్ కుమార్‌తో పాటు అనకాపల్లి మరియు విశాఖ జిల్లాల డెయిరీ డైరెక్టర్లు ఈ చేరికలో భాగమయ్యారు.
కూటమి పార్టీల్లో చేరికలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాటలను బీజేపీ బేఖాతరు చేసిందనే ఆరోపణలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూటమి పార్టీల్లో మనకు కావాల్సినంత మంది నాయకులు ఉన్నారని, పార్టీలు మారే వారు మనకు అవసరం లేదు.. ఎవరు వచ్చినా చేర్చుకోవద్దు అని కూటమి పార్టీలకు సూచించారు. అయ్యన్న ఇలా వ్యాఖ్యలు చేసి 48 గంటలు కూడా గడవక ముందే బీజేపీలోకి ఆనంద్‌తో సహా, 12 మందిని చేర్చుకుంది బీజేపీ. దీంతో కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారింది.
స్పీకర్ అయ్యన్న మాటలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కనీసం పట్టించుకోలేదని అధికార టీడీపీ నేతలు వాపోతున్నారు. అయ్యన్న సూచనను ఆమె కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదని గుర్రుగా ఉన్నట్లు సమాచారం.







