మూడు వన్డేల సిరీస్‌లో భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఇప్పుడు అందరి దృష్టి నిర్ణయాత్మక మూడో వన్డేపైనే ఉంది. ఈ కీలక మ్యాచ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ (Indore) వేదికగా జరగనుండగా, మ్యాచ్‌కు ముందురోజు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆధ్యాత్మిక బాట పట్టారు.
ఇవాళ తెల్లవారుజామున ఉజ్జయినిలోని ప్రసిద్ధ శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) సందర్శించారు. ఉదయం 4 గంటలకు జరిగే పవిత్ర ‘భస్మ హారతి’లో పాల్గొని, దాదాపు రెండు గంటల పాటు ఆలయంలో గడిపారు. అనంతరం నంది హాల్‌లో కూర్చొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. సిరీస్ డిసైడర్‌కు ముందు ఈ భక్తి క్షణాలు ఆటగాళ్లకు మానసిక స్థైర్యాన్ని అందించాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
గమనార్హంగా, వీరి కంటే ఒక రోజు ముందే టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) కూడా మహాకాళేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక శక్తితో సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న ఆశతో టీమిండియా ఇండోర్ పోరుకు సిద్ధమవుతోంది.







