ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగింపు?

పంచాయతీల చేతికే ఉపాధి హామీ.. నరేగా పేరుకు గుడ్‌బై!

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (Rural Employment Guarantee Scheme) కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును మార్చి, కొత్తగా ‘గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్’ (Guarantee for Rozgar and Aajeevika Mission – Grameen) పేరుతో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ బిల్లును ‘వికసిత్ భారత్ జి రాంజీ బిల్లు’గా (Viksit Bharat Ji Ramjee Bill) ప్రభుత్వం పేర్కొన‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ కొత్త విధానంలో ఉపాధి హామీ పనుల ప్లానింగ్ బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిల్లో పనుల ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలను A, B, C కేటగిరీలుగా విభజించి, కేంద్రం నిర్ణయించిన నిర్దిష్ట పారామీటర్ల ఆధారంగా నిధులు కేటాయించనుంది.

నిధుల కేటాయింపులో కీలక మార్పులు
కేంద్రం నిర్దేశించిన నిధులకు మించి ఖర్చు చేయాల్సి వస్తే, ఆ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని బిల్లులో స్పష్టంగా పేర్కొననున్నారు. నిధుల పంపిణీలో 60:40 నిష్పత్తి కొనసాగనుంది. ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.

  • కొత్త బిల్లులో ముఖ్యాంశాలు
  • ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధి హామీ
  • వేతనాలను వారానికోసారి నేరుగా చెల్లించే విధానం
  • వ్యవసాయ పనుల రద్దీ కాలంలో కార్మికుల లభ్యత కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో 60 రోజుల ప్రత్యేక పనులు
  • ఉపాధి కోసం దరఖాస్తు చేసిన 15 రోజుల్లో పని కల్పించకపోతే నిరుద్యోగ భత్యం చెల్లింపు

గ్రామీణ ఉపాధి వ్యవస్థలో కొత్త దశ
ఈ మార్పులతో గ్రామ పంచాయతీలకు మరింత ప్రాధాన్యం పెరగనుండగా, ఉపాధి హామీ పథకం పూర్తిగా వికసిత్ భారత్ దృక్పథంతో అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే నరేగా పేరును తొలగించడంపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గ్రామీణ ఉపాధి హామీ వ్యవస్థలో ఈ కొత్త బిల్లు ఎంతవరకు ఫలితాలు ఇస్తుందన్నది రానున్న రోజుల్లో స్పష్టమవనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment