తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలాంగరైలో ఉన్న ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి ఒక అనామక ఈ-మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలతో విజయ్ ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ-మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
ఇటీవల కరూర్‌లో టీవీకే పార్టీ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది. సుమారు 80 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు టీవీకే నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విజయ్‌ను అరెస్ట్ చేయవచ్చన్న ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. దీంతో చెన్నైలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.







