ఫిట్‌నెస్ సెంటర్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత స్టెరాయిడ్స్ విక్రయాలు విజయవాడ (Vijayawada)లో సంచలనం సృష్టిస్తున్నాయి. పటమట ప్రాంతంలోని Anytime Fitness Centerపై ఈగల్, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులు చేసి స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నాయి. జిమ్ ట్రైనర్ (Gym Trainer) రసూల్ (Rasool) వద్ద నుంచి పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ పట్టుబడగా, అతడు వాటిని జిమ్ కి వచ్చే యువతకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తులో రసూల్ నగరంలోని పలు జిమ్‌లకు కూడా ఈ స్టెరాయిడ్స్ (Steroids) సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. సమీర్ అనే హెల్త్ సప్లిమెంట్స్ వ్యాపారి సహకారంతో వీటిని అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. సమీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనితో పాటు మరో స్నేహితుడు సునీల్ కూడా ఈ రాకెట్‌లో భాగస్వామి అని పోలీసులు గుర్తించారు.
ఈగల్, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో పెద్ద ఎత్తున నిషేధిత స్టెరాయిడ్స్ పట్టుబడ్డాయి. వీటిని యువత ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉపయోగిస్తున్నారని అధికారులు తెలిపారు. స్టెరాయిడ్స్ వాడకంతో అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతున్న నేపథ్యంలో ఈ రాకెట్‌పై దర్యాప్తు వేగవంతం చేశారు.
పటమట పోలీసులు ప్రధాన నిందితుడు రసూల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సమీర్ (Sameer), సునీల్ (Sunil)ల కోసం గాలింపు కొనసాగుతోంది. నగరంలోని ఇతర జిమ్‌లలో కూడా ఇలాంటి రాకెట్లు ఉన్నాయా అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు.





 



