యువతి (Young Woman) విషయంలో ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవ.. ఒకరి జీవితాన్ని కడతేర్చింది. విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో రౌడీషీటర్ హత్య (Rowdy-Sheeter Murder) సంచలనం సృష్టించింది. ఎంవీపీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో విజయవాడకు చెందిన రౌడీ షీటర్ శ్రీధర్‌బాబు (33) మృతి చెందగా, మరో రౌడీషీటర్ గౌరీశంకర్ (38)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. ఈనెల 7వ తేదీన కోర్టు వాయిదా కోసం విజయవాడ (Vijayawada)కు చెందిన రౌడీషీటర్ కసింకోట శ్రీధర్ బాబు (Kasinkota Sridhar Babu), ఎలమంచిలికి చెందిన రౌడీషీటర్ గౌరీ శంకర్ (Gauri Shankar) ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు ముగిసిన తర్వాత వారు రాత్రి సీతమ్మధారలోని ఓ ఇంట్లో బస చేశారు. అక్కడ మద్యం సేవిస్తూ ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది.
వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో గౌరీ శంకర్ కత్తితో శ్రీధర్ బాబుపై దాడి చేసి, అతనికి తీవ్ర గాయాలు చేశాడు. అనంతరం అతని కాళ్లు, చేతులు కట్టి కారులో ఎక్కించి ఎలమంచిలికి తీసుకెళ్లాడు. మర్రిబంధ వద్దగల పోలవరం కాలువలో మృతదేహాన్ని విసిరేశాడు.
రెండు రోజుల పాటు శ్రీధర్‌బాబు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతకగా, పోలవరం కాలువలో ఒక మృతదేహం తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, అది శ్రీధర్ బాబు దేనని నిర్ధారించారు. తదనంతరం పోలీసులు రౌడీషీటర్ గౌరీ శంకర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. దర్యాప్తులో హత్య వివరాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








