విజయవాడ పోలీసులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా, ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. విజయవాడ బస్టాండ్ వద్ద గల బాలాజీ హోటల్‌లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో హోటల్ గదిలో ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే తుపాకీ ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సమయస్ఫూర్తితో స్పందించిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒక 9 ఎంఎం పిస్టల్‌తో పాటు ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో కాల్పులకు యత్నించిన వ్యక్తి వరంగల్‌కు చెందిన వాడిగా గుర్తించారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని మరింత సమాచారం కోసం విచారిస్తున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసును ఈగల్ టీమ్ విభాగం విచారిస్తోంది. ఆయుధం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? పోలీసులపై కాల్పులకు ఎందుకు యత్నించాడు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.








