కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం నటుడు, టీవీకే అధినేత విజయ్ స్పందించారు. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతిచెందడం గురించి ఎమోషనల్ అవుతూనే తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ ఓ వీడియో విడుదల చేశాడు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధితులను త్వరలోనే స్వయంగా పరామర్శిస్తానని ఆయన హామీ ఇచ్చారు. “నా గుండె ముక్కలైంది.. మాటలు రావడం లేదు” అని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
విజయ్ మాట్లాడుతూ.. తనపై ఉన్న ప్రేమతోనే వేలాది మంది ప్రజలు ర్యాలీకి తరలివచ్చారని గుర్తుచేశారు. అయితే ఊహించని రీతిలో జరిగిన ఈ తొక్కిసలాట బాధాకరమని పేర్కొన్నారు. ర్యాలీకి సంబంధించి అన్ని అనుమతులు సక్రమంగా తీసుకున్నామని, తమ తరఫు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్యాయం అని విజయ్ అభిప్రాయపడ్డారు.
“నన్ను టార్గెట్ చేయండి, నేను తట్టుకుంటాను. కానీ నా కార్యకర్తల జోలికి, ప్రజల జోలికి వెళ్లకండి” అని విజయ్ స్పష్టం చేశారు. సీఎం స్టాలిన్ ఈ ఘటనను ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంగా మలుస్తున్నారా? అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు. నిజం త్వరలోనే బయటకు వస్తుందని, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని విజయ్ తెలిపారు. తొక్కిసలాట ఘటనపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందని, నిరపరాధులపై చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలకు మించినది ఏది లేదని, బాధిత కుటుంబాలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని విజయ్ హామీ ఇచ్చారు.








