బెట్టింగ్ యాప్ (Betting App) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన ఈడీ అధికారులు, తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను నేడు విచారణకు పిలిపించారు. దీంతో “రౌడీ బాయ్” (Rowdy Boy) విచారణలో ఏమి చెప్పనున్నాడన్న విషయంపై సినీ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj)ను ఈడీ(ED)విచారించింది. ఆయన “ఇటీవల యాప్స్ ప్రమోషన్ చేసినందుకు పశ్చాత్తాపం ఉంది, ఇకపై అలాంటి ప్రచారాల్లో పాల్గొనను” అని చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు విజయ్ దేవరకొండ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో, ఈడీ ప్రధానంగా మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించనుంది.
ఈ విచారణలో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ నుంచి పొందిన పారితోషికం, కమిషన్‌లు, వాటి లావాదేవీలు గురించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చట్టవిరుద్ధమైన యాప్‌లకు ప్రచారం ఎందుకు చేశాడు? ఎవరి సూచనలతో చేశాడు? అన్న అంశాలపై కూడా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది.
ఇకపోతే, ఈ కేసులో మరో కీలక మలుపు ఏమిటంటే — దగ్గుబాటి రానా (Daggubati Rana)కు ఆగస్టు 11న, నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi)కి ఆగస్టు 13న ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ అయ్యాయి. టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో, ఈడీ దర్యాప్తు వేగవంతమైంది.
ఇప్పటికే సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మొత్తం 29 మంది సినీ ప్రముఖులు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, దివి తదితరులు ఉన్నారు.







