రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం కింగ్ డమ్ (Kingdom). జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలిరోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్, సత్యదేవ్ పవర్ ఫుల్ రోల్, మరియు అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
భారీ ఓపెనింగ్స్, రికార్డుల మోత
తాజాగా, కింగ్ డమ్ సినిమా మొదటి రోజు కలెక్షన్లను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 39 కోట్లకు పైగా వసూలు చేసిందని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
అంతేకాకుండా, కేరళలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన తెలుగు సినిమాగా కింగ్ డమ్ రికార్డు సృష్టించింది. మొదటి రోజు కేరళలో రూ. 50 లక్షలకు పైగా వసూళ్లు సాధించినట్టు సమాచారం. ఈ ఏడాది కేరళలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఇదే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ జోరు
తెలుగు రాష్ట్రాల్లోనూ కింగ్ డమ్ దూసుకుపోతోంది. తొలి రోజు తెలంగాణలో రూ. 6.72 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6.9 కోట్లు వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే కూడా ముఖ్య పాత్రలు పోషించారు.