తమిళనాడు (Tamil Nadu)లోని కరూర్ (Karur) జిల్లాలో టీవీకే ర్యాలీ (TVK Rally) సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై ఆ పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్(Vijay) స్పందించారు. ఈ ఘటనలో 40 మంది దుర్మరణం చెందిన నేపథ్యంలో ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు.
“నిన్న కరూర్‌లో జరిగిన ఘటన గురించి ఆలోచిస్తుంటే నా హృదయం చాలా భారంగా ఉంది. బంధువులను కోల్పోయిన కుటుంబాల బాధను నేను ఎలా వ్యక్తపరచాలో అర్థం కావడం లేదు. ఈ నష్టం ఎవరూ భర్తీ చేయలేరు. ఎవరు ఎంత ఓదార్పు చెప్పినా, అది మన బంధువులను తిరిగి ఇవ్వదు” అని విజయ్ పేర్కొన్నారు.
“మా బంధువుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు, గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం (Financial Assistance) అందజేస్తాను. ఇది పెద్ద మొత్తం కాదనిపించవచ్చు. కానీ ఈ కష్ట సమయంలో, మీ కుటుంబ సభ్యుడిగా మీ పక్కన నిలబడటం నా కర్తవ్యం” అని చెప్పారు.
అదేవిధంగా, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, “మా తమిళనాడు వెట్రి కళగం వారందరికీ అవసరమైన సహాయం చేస్తుంది. దేవుని దయతో ఈ కష్టాన్ని అందరం కలిసి అధిగమిద్దాం” అని విజయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.







