ఉపరాష్ట్రపతి (Vice President) సి.పి. రాధాకృష్ణన్ (Vice President) తన సొంత రాష్ట్రమైన తమిళనాడు (Tamil Nadu)లో మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం కోయంబత్తూరు చేరుకున్నారు. విమానాశ్రయంలో బీజేపీ(BJP) నాయకులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే, పర్యటన సందర్భంగా కోయంబత్తూరులో భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. రాధాకృష్ణన్ కాన్వాయ్ వెళ్తుండగా, ఎదురుగా ఇద్దరు యువకులు స్కూటర్‌పై రావడం ఈ భద్రతా లోపానికి నిదర్శనం. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, వెంటనే దర్యాప్తు చేయాలని, వీవీఐపీ భద్రతా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కోయంబత్తూరులోని కోడిసియాలో రాధాకృష్ణన్‌కు కోయంబత్తూరు (Coimbatore) సిటిజన్ ఫోరం ఘనంగా సత్కరించి, గార్డ్ ఆఫ్ ఆనర్‌ను అందించింది. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి కోయంబత్తూరులోని పేరూర్ మఠంలో జరిగిన శాంతలింగ రామసామి అడిగలర్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. క్రమశిక్షణ, సామరస్యపూర్వక సమాజాన్ని పెంపొందించడంలో అడిగలర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఉపరాష్ట్రపతి పర్యటన అక్టోబర్ 29న తిరుప్పూర్‌లో సన్మానం, మధురై మీనాక్షి అమ్మన్ ఆలయంలో ప్రార్థనలు, అలాగే అక్టోబర్ 30న రామనాథపురం జిల్లాలోని పసుంపొన్‌లో జరిగే ముత్తురామలింగ తేవర్ జయంతి కార్యక్రమానికి హాజరు కావడంతో ముగుస్తుంది.





 



