అమెరికాలో జరిగిన హృదయవిదారక ఘటనకు న్యాయపరమైన తుది తీర్పు లభించింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలు యువతి జాహ్నవి కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి సియాటెల్ నగర యంత్రాంగం జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల (సుమారు 31 మిలియన్ డాలర్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది.
వివరాల్లోకి వెళితే.. 2023 జనవరిలో అమెరికాలోని సియాటెల్ నగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి (23) అనే యువతి రోడ్డు దాటుతుండగా, అత్యధిక వేగంతో వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.
ప్రమాదం తర్వాత పోలీస్ అధికారి డేనియల్ అడరర్ “ఆమె చనిపోయింది… ఆమె చాలా మామూలు మనిషి… 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది హహహ” అంటూ నవ్వుతూ మాట్లాడినట్లు ఆడియో రికార్డులు బయటకు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
న్యాయం కోసం పోరాడిన కుటుంబం
జాహ్నవి కుటుంబం ఈ ఘటనపై న్యాయం కోసం కోర్టును ఆశ్రయించింది. పోలీస్ నిర్లక్ష్యం, అమానుష ప్రవర్తన, అధికార దుర్వినియోగంపై కేసు నమోదు అయింది. దీర్ఘకాల న్యాయపోరాటం అనంతరం సియాటెల్ నగర యంత్రాంగం బాధిత కుటుంబానికి భారీ పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యం వల్లే జాహ్నవి మృతి చెందిందని అంగీకరించిన సియాటెల్ నగర పాలకులు, ఆమె కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది అమెరికాలో ఇటువంటి ఘటనల్లో ప్రకటించిన అత్యధిక పరిహారాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశం
ఈ ఘటన భారత్తో పాటు అమెరికాలోనూ విస్తృత చర్చకు దారితీసింది. పోలీసుల బాధ్యత, మానవ విలువలు, జవాబుదారీతనంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి. జాహ్నవి కుటుంబానికి న్యాయం లభించినప్పటికీ, ఒక యువతి ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేనన్న విషాదం మిగిలిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిహారం ఘటనల పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థలో మార్పులకు దారి తీయాలని మానవ హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు.








