అమెరికాలో ప్రస్తుత ఫ్లూ సీజన్’ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ, నైరుతి, దక్షిణ రాష్ట్రాల్లో ఈ శీతాకాలంలో (వింటర్ వైరస్ సీజన్, ఫ్లూ సీజన్) రికార్డు స్థాయిలో ఫ్లూ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం విడుదలైన ఆసుపత్రుల రిపోర్టులు, సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) అంచనాల ప్రకారం, మొత్తం 43 రాష్ట్రాల్లో గరిష్ఠ సంఖ్యలో బాధితులు ఉన్నారు.
సాధారణంగా శీతాకాలంలో నమోదయ్యే గరిష్ఠ స్థాయిని మించి, ఈసారి మరింత తీవ్రమైన పరిస్థితి నెలకొంది. ఫ్లూ కారణంగా ఇప్పటి వరకు సుమారు 2.4 కోట్ల మంది వైరస్ బారిన పడగా, 3.1 లక్షల మంది ఆసుపత్రిలో చేరారు. మరణాల సంఖ్య 13 వేలు దాటగా, వీరిలో 57 మంది చిన్నారులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఆరోగ్య నిపుణుల సూచనలు
ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో కోవిడ్-19 ఉన్న చిన్నారుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు ఆరు నెలల కంటే ఎక్కువ వయసున్న ప్రతి ఒక్కరూ ఫ్లూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు, సీజనల్ వైరస్‌లను నివారించేందుకు సంబంధిత ఆరోగ్య నిబంధనలు తప్పక పాటించాలని హెచ్చరిస్తున్నారు.