మెగా కోడలు ఉపాసన కొణిదెల తన సోషల్ మీడియా పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్ వంటి విషయాలపై ఆమె పంచుకునే ఆలోచనలు చాలా మందిని ఆకట్టుకుంటాయి. తాజాగా ‘ద ఖాస్ ఆద్మీ’ అనే పోడ్‌కాస్ట్‌లో ఆమె తన వ్యక్తిగత జీవితం, విజయాలు, మరియు సమాజంలో మహిళల స్థానం గురించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉపాసన మాట్లాడుతూ, సమాజం ఆడవారిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయదని, వారు వినయంగా ఉండాలని మాత్రమే చెబుతుందని అన్నారు. కానీ వారు విజయాలు సాధించమని ప్రోత్సహించదని చెప్పారు. ఆమె తన జీవితంలో సాధించిన విజయాల వెనుక తన కుటుంబం నుండి అపారమైన మద్దతు ఉందని స్పష్టం చేశారు.
అలాగే, తన విజయాలు, హోదా కేవలం మెగాస్టార్ చిరంజీవి కోడలిగా లేదా రామ్ చరణ్ భార్యగా వచ్చినవి కాదని ఉపాసన గట్టిగా చెప్పారు. “నాకు ఈ గౌరవం పెళ్లి వల్ల రాలేదు. రామ్ చరణ్ భార్యను కాబట్టి ఈ పొజిషన్‌కు రాలేదు. దీని వెనుక ఎంతో ఒత్తిడి, శ్రమ ఉన్నాయి. ఎన్నో సవాళ్లను దాటుకుని ఈ స్థాయిలో నిలబడ్డాను. ఎవరైనా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, ఉన్న లగ్జరీలను పక్కనపెట్టి కష్టపడాలి. సవాళ్లను ఎదుర్కోవడం వల్ల మరింత రాటుదేలుతారు” అని ఉపాసన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్‌కు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె చేసిన ఈ కామెంట్లు అనేక మంది మహిళలకు స్ఫూర్తినిస్తున్నాయి.