ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై నెల రోజులు కూడా గడవకముందే భర్తను హత్య చేయించి ప్రియుడితో కలిసి ఉండాలని కుట్రపన్నిన ఘటన ఔరయ్య జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రగతి యాదవ్ (22), అనురాగ్ యాదవ్ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కానీ యువతి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు. మార్చి 5న ఆమెకు దిలీప్ (25) అనే వ్యక్తితో బలవంతంగా వివాహం జరిపించారు. అయితే ఈ పెళ్లిని ప్రగతి అంగీకరించలేదు. ప్రియుడి కోసం భర్తను అడ్డుగా భావించి, అతడిని హత్య చేయాలని అనురాగ్‌తో కలిసి కుట్ర పన్నింది.
రూ.2 లక్షల సుఫారీ..
మార్చి 19న దిలీప్‌ను పొలాల్లోకి తీసుకెళ్లి, కాంట్రాక్ట్ కిల్లర్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన దిలీప్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మార్చి 21న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై దిలీప్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు దిలీప్ హత్యకు ప్లాన్ వేసిన ప్రగతి, అనురాగ్‌తో పాటు హత్యకు చేసిన వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో నిందితుల వద్ద నుంచి రెండు పిస్టల్స్, నాలుగు లైవ్ కార్ట్రిడ్జ్‌లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డు, రూ.3,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.