దేశంలో మహిళలపై వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో కేంద్ర యువజన వ్యవహారాల సహాయ మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకి వేధింపులు ఎదురైన ఘటన కలకలం రేపుతోంది. మహాశివరాత్రి సందర్భంగా జల్గావ్ జిల్లా ముక్తాయ్ నగర్‌లో జరిగిన జాతరలో ఆమె కుమార్తెను కొంతమంది యువకులు అసభ్యంగా ప్రవర్తించి వేధించారని, ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రక్షా ఖడ్సే వెల్లడించారు.
నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్
“మంత్రుల కుటుంబాలు కూడా సురక్షితంగా లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?” అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రక్షా ఖడ్సే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తక్షణ చర్య
ముక్తాయ్ నగర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుషానత్ పింగ్డే మాట్లాడుతూ.. నిందితులు అనేక మంది బాలికలతో దురుసుగా ప్రవర్తించారని, అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారని తెలిపారు. ఇప్పటి వరకు ఏడుగురు నిందితుల పేర్లు గుర్తించగా, వారిలో ఒకరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. లైంగిక వేధింపులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.








