విజయవాడ నోవాటెల్ హోటల్‌లో జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా కీలక సూచనలు చేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేడర్‌కు కీలక సూచనలు చేసిన షా.. కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహాయం, పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని నేతలకు సూచించారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రాష్ట్ర బీజేపీ ముందుకు సాగాలని అమిత్ షా పిలుపునిచ్చారు. నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టి, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన ‘హైందవ శంఖారావం’ సభ విజయవంతంపై అభినందనలు తెలియజేశారు. ఇది హైందవ సమాజం బలోపేతానికి కీలకమైన మొదటి అడుగు అని అభిప్రాయపడ్డారు.
తిరుమల తొక్కిసలాటపై చర్చ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో తిరుమల తొక్కిసలాట ఘటనపై చర్చించినట్లు సమాచారం.
కేంద్ర హోంశాఖ ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. భక్తుల భద్రత, నిర్వహణపై చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం కర్తవ్యమని సూచించినట్లు తెలుస్తోంది.