ఉగాండా (Uganda)లో పెను విషాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు, నాలుగు ఇతర వాహనాలు ఒకేసారి ఢీకొన్న భయంకరమైన రోడ్డు ప్రమాదం (Road Accident)లో 63 మంది దుర్మరణం (Tragically Died) పాలయ్యారు. ఈ ఘోర ఘటనలో పలువురు గాయపడ్డారు. ఉత్తర ఉగాండాలోని ప్రధాన నగరం గులుకు వెళ్లే హైవేపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులు వెల్లడించారు. రోడ్డుకు వ్యతిరేక దిశల్లో వాహనాలు వేగంగా రావడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా, బస్సు డ్రైవర్లు ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేసే క్రమంలో, రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని పోలీసులు వివరించారు.
ఘటన స్థలం నుండి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్‌టేకింగే అని పేర్కొన్న పోలీసులు, వాహనదారులు రోడ్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






 



