ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేటి నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 10న టీమిండియా యూఏఈతో తలపడనుంది. ఈ నేపథ్యంలో యూఏఈ బౌలర్ సిమ్రన్‌జిత్ సింగ్, టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. గిల్ తనకు చిన్నప్పటి నుంచీ తెలుసని, కానీ ఇప్పుడు అతనికి తాను గుర్తున్నానో లేదో తెలియదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
“శుభ్‌మన్ గిల్ నాకు చిన్నప్పుడు తెలుసు. 2011-12లో అతనికి 11 లేదా 12 ఏళ్లు ఉంటాయి. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) అకాడమీలో మేము కలిసి ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శిక్షణ తీసుకునేవాళ్లం. గిల్ తన తండ్రితో కలిసి ప్రాక్టీస్‌కు వచ్చేవాడు. నేను అప్పుడు అతనికి బౌలింగ్ చేశాను. ఇప్పుడు అతను నన్ను గుర్తుపడతాడో లేదో తెలియదు,” అని సిమ్రన్‌జిత్ అన్నాడు. అందుకే భారత్‌తో జరిగే మ్యాచ్ తనకెంతో ప్రత్యేకమని తెలిపాడు.
సిమ్రన్‌జిత్ క్రికెట్ ప్రయాణం:
సిమ్రన్‌జిత్ సింగ్ తన క్రికెట్ ప్రయాణాన్ని పంజాబ్‌లో జిల్లా స్థాయి నుంచి ప్రారంభించాడు. 2017లో రంజీ జట్టు ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నప్పటికీ, అనుకున్నంతగా రాణించలేకపోయాడు. గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు.
కరోనా సమయంలో, ఏప్రిల్ 2021లో ప్రాక్టీస్ కోసం 20 రోజులు దుబాయ్ వెళ్లిన సిమ్రన్‌జిత్, లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయాడు. అక్కడే క్లబ్ క్రికెట్ ఆడుతూ, జూనియర్లకు శిక్షణ ఇచ్చాడు. యూఏఈ జట్టు తరఫున ఆడటానికి మూడు సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాత, యూఏఈ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విధంగా దుబాయ్ ప్రయాణం అతని క్రికెట్ కెరీర్‌కు ఒక మలుపుగా మారింది.