శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ కీలక నిర్ణయాలు

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ కీలక నిర్ణయాలు

క‌లియుగ దైవం శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి (Sri Venkateswara Swamy) బ్రహ్మోత్సవాల (Brahmotsavam’s) ఏర్పాట్లపై తిరుమ‌ల (Tirumala) తిరుప‌తి (Tirupati) పాలకమండలి సమావేశం (Governing Council Meeting)లో విస్తృతంగా చర్చించారు. ఈ నెల 23న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, 24వ తేదీన సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (B.R.Naidu) తెలిపారు. గరుడసేవ రోజున 3 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ (Geo Tagging) విధానం అమలు చేయనున్నట్టు చెప్పారు. గరుడసేవ రోజున భక్తులకు 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు.

బ్రహ్మోత్సవాల నిర్వహణలో తొలిసారి ఇస్రో (ISRO)ను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి శాటిలైట్ (Satellite) చిత్రాలను వినియోగిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల చిత్రీకరణ బాధ్యత ముంబై సంస్థ తీసుకున్నదని, ఆ వీడియోలను ఉచితంగా టీటీడీకి అందజేస్తుందని బీఆర్‌ నాయుడు వివరించారు. ఇక, పది రోజుల పాటు సిఫార్సు లేఖల ఆధారంగా ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు ప్రకటించారు.

అలాగే మతమార్పిడులను అరికట్టే లక్ష్యంతో శ్రీవాణి ట్రస్టు నిధులను ఉపయోగించి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు ఆలయాల వరకు నిర్మించనున్నట్టు తెలిపారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అలా మాట్లాడితే జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. స్వామి సన్నిధిలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మరింత భక్తి, శాస్త్రీయత మరియు సాంకేతిక సమన్వయంతో జరుగుతాయని ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment