హమాస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. బందీలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు(Hamas Warning). బుధవారం సోషల్ మీడియా వేదికగా ఈ తీవ్ర హెచ్చరికను జారీ చేశారు.
బందీలను వదిలిపెట్టడమే కాకుండా, మరణించిన వారి మృతదేహాలను కూడా తిరిగి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే హమాస్‌లో ఎవరూ సురక్షితంగా ఉండరని స్పష్టం చేశారు. గాజా ప్రజల కోసం మంచి భవిష్యత్తు ఉందని, హమాస్ వెంటనే దారి మార్చుకోవాలని ట్రంప్ సూచించారు.
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి, 250 మందిని బందీలుగా తీసుకెళ్లింది. అప్పటి నుంచి కొందరు మధ్యవర్తుల సహాయంతో బందీల మార్పిడి జరిగింది. కానీ ఇంకా పలువురు విదేశీయులు, ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చెరలోనే ఉన్నారు. ప్రస్తుతం హమాస్ చెరలో 59 మంది బందీలు ఉన్నారని సమాచారం. వీరిలో ఐదుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. వీరి విడుదల కోసం వైట్ హౌస్ ప్రత్యేక దౌత్య ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, హమాస్ ఇప్పటికీ సానుకూలంగా స్పందించలేదు.
యుద్ధం మళ్లీ చెలరేగే సూచనలు
హమాస్ వైఖరితో ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి సిద్ధమవుతోంది. మరో దఫా కాల్పుల విరమణ ఒప్పందంపై స్పష్టత రాకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ మరోసారి హమాస్‌ను కఠినంగా హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.








