ఇండియన్స్ కి ట్రంప్ మరో షాక్.. హెచ్‌-1బీ వీసాల్లో మళ్లీ మార్పులు

ఇండియన్స్ కి ట్రంప్ మరో షాక్.. హెచ్‌-1బీ వీసాల్లో మళ్లీ మార్పులు

కొత్తగా జారీ అయ్యే హెచ్‌-1బీ (H-1B) వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన లక్ష డాలర్ల (సుమారు రూ. 80 లక్షలు) భారీ ఫీజు ఇప్పటికే భారతీయ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో, ట్రంప్ కార్యవర్గం హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో మరిన్ని కఠినమైన మార్పులు తీసుకురావడానికి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

‘రిఫార్మింగ్ ది హెచ్‌-1బీ నాన్-ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్’ పేరుతో ఫెడరల్ రిజిస్టర్‌లో నమోదు చేసిన ఈ ప్రతిపాదనల ప్రకారం, వీసా పరిమితి మినహాయింపుల అర్హత నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. అంతేకాక, వీసా నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలు మరియు థర్డ్ పార్టీ నియామకాలపై మరింత పకడ్బందీగా దృష్టి సారించనున్నారు. ఈ మార్పులన్నీ ముఖ్యంగా యూఎస్ కార్మికుల వేతనాలు మరియు పని పరిస్థితులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినట్లు ఆ ప్రతిపాదనల్లో తెలిపారు.

ఈ కఠిన నిబంధనల ప్రతిపాదనలు భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. మినహాయింపుల పరిమితిలో మార్పులు చేస్తే, లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, హెల్త్‌కేర్ సంస్థలు ప్రస్తుతం పొందుతున్న ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాక, అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు, అలాగే అక్కడ పని చేయాలని చూస్తున్న యువ నిపుణులలో ఈ నిర్ణయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 2025లో వెలువడే అవకాశం ఉందని సమాచారం.

కాగా, ట్రంప్ తీసుకువచ్చిన లక్ష డాలర్ల ఫీజు గత నెల (సెప్టెంబర్ 2025) నుంచే అమలులోకి వచ్చింది. ఈ ఫీజుపై జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏడాది పాటు అమల్లో ఉండనుంది. ఈలోపు యూఎస్ కాంగ్రెస్ చట్టం చేస్తే పూర్తిస్థాయిలో ఈ నిబంధన అమలు కానుంది. ఇప్పటికే ఈ అధిక ఫీజు కారణంగా హెచ్-1బీ వీసాపై ఉద్యోగులను నియమించుకోవడానికి ఐటీ కంపెనీలు ఆర్థికంగా కష్టమైన భారాన్ని ఎదుర్కొంటున్నాయి. కొత్త నిబంధనలు కూడా తోడైతే, కంపెనీలు వీసా ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకడుగు వేసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment