డొనాల్డ్ ట్రంప్ చేతికి ఎట్టకేలకు నోబెల్ బహుమతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చాలాకాలంగా ఆశించిన నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) విషయంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అధికారికంగా ఆయన పేరు ప్రకటించకపోయినా, 2025 సంవత్సరానికి గాను తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని వెనెజులా విపక్ష నేత మారియా కోరినా మచాడో (Maria Corina Machado) ట్రంప్‌కు అందజేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

వైట్ హౌస్‌లో ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంగా మచాడో తనకు అందిన నోబెల్ పీస్ ప్రైజ్‌ను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్, మచాడో ఇచ్చిన నోబెల్ పురస్కారాన్ని తాను అంగీకరిస్తున్నానని వెల్లడించారు. తన సేవలను గౌరవిస్తూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇది పరస్పర గౌరవానికి నిదర్శనమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వెనెజులా భవిష్యత్తుపై కీలక చర్చ
ఈ భేటీలో వెనెజులా భవిష్యత్తు, అక్కడి ప్రజల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంపై ట్రంప్‌తో చర్చించినట్లు మచాడో తెలిపారు. తమ దేశ ప్రజల హక్కుల కోసం ట్రంప్‌పై ఆధారపడవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కరేబియన్ సముద్రంలో మరో చమురు ట్యాంకర్‌ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న అంశాన్ని కూడా ట్రంప్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ఇటీవల అమెరికా దళాలు వెనెజులాలోకి ప్రవేశించి అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro), ఆయన సతీమణిని అరెస్టు చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నడుమ మచాడో–ట్రంప్ భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది.

నోబెల్ ఇవ్వడంపై నెటిజన్ల విమర్శలు
మచాడో తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు ఇవ్వడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోబెల్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఈ అంశంపై గతంలోనే స్పష్టత ఇచ్చింది. ఒకసారి నోబెల్ పురస్కారం ప్రకటించిన తర్వాత దానిని రద్దు చేయడం, బదిలీ చేయడం లేదా మరొకరికి అప్పగించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

అయినా సరే, మచాడో తన మెడల్‌ను ట్రంప్‌కు అప్పగించడం చట్టపరంగా చెల్లుబాటవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, మచాడో ఇచ్చిన నోబెల్ మెడల్‌ను ట్రంప్ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ వ్యవహారం భవిష్యత్తులో మరింత రాజకీయ, న్యాయపరమైన చర్చలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment