అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘హష్ మనీ’ కేసులో కోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో తనకు ఉపశమనం కల్పించాలని ట్రంప్ ఇటీవల కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విజ్ఞప్తిని న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ మర్చన్ తిరస్కరించారు.
అధికారిక చర్యలకు మాత్రమే రక్షణ
ట్రంప్ చేసిన అభ్యర్థనపై జడ్జి జువాన్ మర్చన్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. “అధికారిక చర్యలకు మాత్రమే అధ్యక్షులకు రక్షణ వర్తిస్తుంది. కానీ, ఈ కేసులో అనధికార ప్రవర్తనకు రక్షణ వర్తించదు” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
స్టార్మీ డేనియల్స్ కేసు వివరాలు
ట్రంప్‌పై స్టార్మీ డేనియల్స్ అనే పోర్న్‌స్టార్‌తో ఏకాంతంగా గడిపి, ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు అనధికారికంగా డబ్బులు చెల్లించిన ఆరోపణలు ట్రంప్‌పై ఉన్నాయి. కోర్టులో ఈ కేసు రుజువైనప్పటికీ, ట్రంప్‌కు శిక్ష ఇప్పటికీ ఖరారు కాలేదు.
ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయవంతమైన ట్రంప్ జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నాడు. అయితే, ఈ కేసు ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి.







