ట్రంప్ పంతంపై ప్రజాగ్రహం.. వైట్‌హౌస్ వివరణ!

ట్రంప్ పంతంపై ప్రజాగ్రహం.. వైట్‌హౌస్ వివరణ!

అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలన్న ట్రంప్ సర్కార్ పంతం దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలను రేపింది. గత మూడు రోజులుగా లాస్ ఏంజెలెస్‌కు మాత్రమే పరిమితమైన ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE – ఐస్) ఏరివేత కార్యక్రమం, దానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు ఇప్పుడు ఇతర నగరాలకూ పాకాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటెల్, డాలస్, లూయీ విల్లే, శాన్ ఆంటోనియో, షికాగో నగరాల్లోనూ సోమవారం నుంచి ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఆందోళనకారులనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక వ్యాఖ్యలు నిరసనకారులను మరింత రెచ్చగొట్టాయి.

“బుల్లెట్ల వర్షం కురిపిస్తాం” – ట్రంప్ హెచ్చరిక
“మీరు నిరసన జ్వాలల్ని ఎగదోస్తే మేం బుల్లెట్ల వర్షం కురిపిస్తాం. కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని కట్టడిచేస్తాం. కాలిఫోర్నియా గవర్నర్ ఆందోళనకారులను రెచ్చగొట్టి నేషనల్ గార్డ్‌ల మీదకు ఉసిగొల్పుతున్నారు. గార్డ్‌లను రెచ్చగొడితే దారుణ పరిణామాలను ఎదుర్కొంటారు” అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఆందోళనకారులను హెచ్చరించారు. దానికి తోడు లాస్ ఏంజెలెస్ నగరానికి అదనంగా మరో 2,000 మంది నేషనల్ గార్డ్ రిజర్వ్ బలగాలను పంపించారు. వీరికి తోడుగా 700 మంది నేవీ మెరైన్ సాయుధ సభ్యులూ రంగప్రవేశం చేశారు.

వేలాది మంది ఆందోళనకారులు ఒకవైపు, వందల మంది పోలీసులు, నేషనల్ గార్డ్, మెరైన్లు మరోవైపు ఎదురు నిలబడటంతో లాస్ ఏంజెలెస్ వీధులు యుద్ధక్షేత్రాలను తలపించాయి. డౌన్‌టౌన్ లాస్ ఏంజెలెస్‌లో చాలా మంది మెక్సికో, గ్వాటెమాలా జాతీయ జెండాలతో కనిపించారు. ఆందోళనలను రికార్డ్ చేస్తున్న సీఎన్‌ఎన్ వార్తాసంస్థ విలేకరి, ఫోటో, వీడియో జర్నలిస్ట్‌లను పోలీసులు నిలువరించారు.

గవర్నర్, మేయర్ అభ్యంతరం
కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆందోళనకారులను శాంతించాలని విజ్ఞప్తి చేశారు. అదనపు బలగాలను రప్పిస్తూ మరోసారి అసాధారణ అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేశారని న్యూసమ్ ధ్వజమెత్తారు. సోమవారం రాత్రి లాస్ ఏంజెలెస్‌లోని సివిక్ సెంటర్‌లోని సిటీ హాల్ వద్దకు వేలాదిగా ఆందోళనకారులు గుమిగూడి భారీ ర్యాలీ చేపట్టారు. మరోవైపు పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను బంధించి ఉంచిన డిటెన్షన్ సెంటర్ ఉన్న ఫెడరల్ కాంప్లెక్స్ భవనం వద్దకు సైతం వందల మంది చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లాస్ ఏంజెలెస్ భయంకరమైన ఉద్యమ సంక్షోభంలోకి వెళ్తోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను న్యూసమ్, నగర మహిళా మేయర్ కరెన్ బాస్ తప్పుబట్టారు.

దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఆందోళనలు
కెంటకీ రాష్ట్రం సహా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో, శాంటా అనా, టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్, ఆస్టిన్ నగరాల్లోనూ ‘ఐస్’ వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నగరాల్లో పలు ప్రాంతాల్లో స్థానికులు రోడ్ల మీదకొచ్చి ఇమ్మిగ్రేషన్ అధికారుల ఆకస్మిక దాడులు, అరెస్ట్‌లను తప్పుబట్టారు. బోస్టన్, పీట్స్‌బర్గ్, ఛార్లొటే, సియాటెల్, వాషింగ్టన్ డీసీ, కనెక్టికట్, న్యూయార్క్ నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు భారీ ఎత్తున జరిగాయి. ఆస్టిన్ నగరంలోనూ నేషనల్ గార్డ్ రంగంలోకి దిగారు. ఆస్టిన్ నగరంలో డజనుకు పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ తెలిపారు.

కోర్టుకు చేరిన బలగాల మోహరింపు వివాదం
మరోవైపు, నేషనల్ గార్డ్‌లను రాష్ట్రంలోకి అనుమతించే అంశంలో గవర్నర్ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంపై కోర్టులో కేసు వేశామని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబర్ట్ ఆండ్రీస్ బోంటా మంగళవారం ప్రకటించారు. “మా రాష్ట్రంలో ఎలాంటి అంతర్యుద్ధం లేదు. తిరుగుబాటు అస్సలు లేదు. అలాంటప్పుడు రాష్ట్ర సార్వభౌమత్వాన్ని తొక్కిపెట్టేలా అధ్యక్షుడెలా నిర్ణయాలు తీసుకుంటారు? ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోబోం. అందుకే ట్రంప్, రక్షణ మంత్రి హెగ్సెత్‌పై కేసు వేశాం. ట్రంప్ ఉత్తర్వును చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించాలని కోర్టును కోరాం. అదనపు నేషనల్ గార్డ్‌ల ప్రవేశాన్ని అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించాం” అని ఆయన వెల్లడించారు. నేషనల్ గార్డ్‌లను రాష్ట్రాల్లోకి అనుమతించడాన్ని విపక్ష డెమొక్రాట్లు తప్పుబట్టారు. ట్రంప్ దేశానికి రాజులా భావిస్తున్నారని కాలిఫోర్నియా డెమొక్రటిక్ పార్టీ నేత, దిగువసభ సభ్యుడు జాన్ గ్యారమెండీ ఆరోపించారు. మరోవైపు, గార్డ్‌ల రాకను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్వాగతించింది.

శ్వేతసౌధం వివరణ: వలసదారుల ఏరివేత విధుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఫెడరల్ ఏజెంట్ల రక్షణ, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే నేవీ మెరైన్ బలగాలను రప్పించామని శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. నిరసనలను నిలువరించాలంటే నేవీ మెరైన్లు రావాల్సిందేనని బోర్డర్ జార్ టామ్ హోమన్ అభిప్రాయపడ్డారు.

కార్మిక నేత విడుదల: శుక్రవారం అరెస్టయిన కార్మిక నేత డేవిడ్ హుయెర్టాను 50 వేల డాలర్ల పూచీకత్తుతో ఇమ్మిగ్రేషన్ అధికారులు సోమవారం విడుదల చేశారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ అరెస్ట్ తర్వాతే ఆందోళనలు మరింత ఉధృతమవడం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment