అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ధనిక వలసదారులకు అమెరికా పౌరసత్వం కోసం ‘గోల్డ్ కార్డ్’ పేరుతో భారీ ఆఫర్ ప్రకటించారు. 5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 41 కోట్లు) పెట్టుబడి పెట్టే విదేశీయులకు ఈ గోల్డ్ కార్డ్ జారీ చేసి, పౌరసత్వం ఇస్తామని తెలిపారు. మరిన్ని వివరాలను రెండు వారాల్లో ప్రకటిస్తామన్నారు.
ఉద్యోగాలు సృష్టిస్తే గ్రీన్ కార్డ్
ఎఫ్‌బీ-5 (EB-5) గ్రీన్ కార్డులు అమెరికాలో ఉద్యోగాలు సృష్టించే వారు లేదా భారీ పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే జారీ చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ గోల్డ్ కార్డుల ధరను 5 మిలియన్ డాలర్లుగా నిర్ణయించనున్నట్లు తెలిపారు. ఈ కార్డు ద్వారా సంపన్నులు సులభంగా అమెరికా పౌరసత్వం పొందగలుగుతారని వివరించారు. రష్యన్ పెట్టుబడిదారులు కూడా ఈ పథకానికి అర్హులని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా గోల్డెన్ వీసాల ట్రెండ్
ప్రస్తుతం 100కు పైగా దేశాలు ‘గోల్డెన్ వీసా’ పథకాలు అమలు చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ వీసాలను అందిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు కోటి గోల్డ్ కార్డులు ఇవ్వనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.








