ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) దాడులను (Attacks) ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు (America President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు, దీంతో ట్రంప్ కు సహనం నశించినట్లు కనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా పుతిన్ (Putin) మాట వినడం లేదని ఆగ్రహించిన ట్రంప్, 50 రోజుల్లో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపకపోతే భారీగా సుంకాలు విధిస్తామని రష్యాను హెచ్చరించారు. అయితే, రష్యా ఆ బెదిరింపులకు భయపడబోదని తేల్చిచెప్పింది. దీంతో రష్యా ఇక మాట వినదని ట్రంప్ ఒక అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే రష్యాపై భారీ దాడికి ప్లాన్ చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)ని ట్రంప్ కోరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అందించే ఆయుధాలు మాస్కోను చేరగలవా అని జెలెన్‌స్కీని ట్రంప్ అడిగినట్లు సమాచారం. జూలై 4న పుతిన్‌తో ట్రంప్ మాట్లాడిన తర్వాతే ట్రంప్ ఈ ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది.
ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, అమెరికా సరఫరా చేసే లాంగ్ రేంజ్ క్షిపణులు రష్యా లోపలికి దూసుకుపోయేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ట్రంప్ కోరారు. అమెరికా తయారు చేసిన ATACMS క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించే అవకాశంపై ట్రంప్ అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను పెంటగాన్ నిలిపివేసిన కొద్ది వారాల తర్వాత ఈ చర్చ జరగడం విశేషం.