తమిళనాడులో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతున్న వేళ రాజకీయ నాయకుల మధ్య విమర్శలు తీవ్రంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్‌పై విమర్శలు చేస్తూ, రాజకీయాల గురించి మాట్లాడే ముందు వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకోవాలని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా నటి త్రిష పేరును ప్రస్తావించడం వివాదాస్పదమైంది.
నాగేంద్రన్ వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు, అలాగే విజయ్ స్థాపించిన టీవీకే వర్గాలు ఖండించాయి. వ్యక్తిగత విషయాలను రాజకీయ వేదికపైకి తీసుకురావడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.
త్రిష తరఫున లాయర్ స్పందన
ఈ వివాదంపై త్రిష తరఫున ఆమె లాయర్ నిత్యేష్ నటరాజ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో “ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్ ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగడం తగదు” అని పేర్కొన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ డిబేట్‌లోకి తేవడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రూమర్లకు రాజకీయ రంగు
విజయ్, త్రిష కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇటీవల విడుదలైన ‘GOAT’ చిత్రంలో కూడా త్రిష ప్రత్యేక గీతంలో కనిపించారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి వ్యక్తిగత సంబంధాలపై కోలీవుడ్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి రాజకీయ పరిణామాల్లో ఆ రూమర్లను విమర్శల సాధనంగా ఉపయోగించడమే ఈ వివాదానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చనీయాంశమవుతోంది.








