విజయనగరం (Vizianagaram) జిల్లా బొబ్బిలి (Bobbili) మండలం కృపావలస గ్రామంలోని గిరిజనులు (Tribal People) వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ.. మెడకు ఉరితాడు బిగించి సామూహిక ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆందోళనకు దిగారు. రోడ్లు, విద్యుత్, పాఠశాల, తాగు నీరు లాంటి మౌలిక సదుపాయాలు (Basic Amenities) వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan) స్పందించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
గోపాల రాయుడుపేట రెవెన్యూ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలను ఒకే పంచాయతీలో కలపాలని కృపావలస గ్రామంలోని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇక, నిరసన గురించి తెలుసుకున్న బొబ్బిలి ఆర్డీవో, జిల్లా పంచాయతీ అధికారి కృపావలస గిరిజన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని గిరిజనులు కోరారు. అయితే, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని గిరిజనులు స్పష్టం చేశారు.








