టాలీవుడ్ (Tollywood) సినీ కార్మికుల సమ్మె (Cinema Workers Strike) 10వ రోజుకు చేరుకుంది. కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలనే డిమాండ్‌తో మొదలైన ఆందోళన పదిరోజులైనా ఓ కొలిక్కి రాలేదు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber)లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ మెంబర్స్, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి (Komatireddy) సూచనలతో కీలక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల అనంతరం సమ్మెపై తుది నిర్ణయం వెలువడనుంది.
సోమవారం ఎఫ్‌డీసీ (FDC) ఛైర్మన్ (Chairman) దిల్ రాజు (Dil Raju) ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో వేర్వేరుగా సమావేశమైన మంత్రి కోమటిరెడ్డి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో సమ్మెకు పరిష్కారం లభించవచ్చని అటు సినీ కార్మికులు, ఇటు నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో షూటింగ్స్ నిలిచిపోవడానికి కారణం నిర్మాతలు పెట్టిన షరతుల్లో డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ వేతనాల పెంపుపై ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మిగతా యూనియన్‌లకు వేతనాలు పెంచిన నిర్మాతలు, ఈ మూడు విభాగాలకు మాత్రం పెంపు ఇవ్వలేదు. రోజువారీ వేతనం రూ.2,000 లోపు ఉన్న వారికి 25 శాతం పెంపు అమలుకు ముందుకొచ్చారు. అయితే ఈ మూడు యూనియన్ల వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈరోజు చర్చల్లో అందరికీ న్యాయం జరుగుతుందని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ఆశాభావం వ్యక్తం చేశారు.