తెలుగు చలనచిత్ర (Telugu Film Industry) పరిశ్రమలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరియు నిర్మాతల మధ్య 30 శాతం వేతన పెంపు డిమాండ్‌పై చర్చలు విఫలమవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్నటి నుంచి సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో టాలీవుడ్లో అన్ని షూటింగ్‌లు నిలిచిపోయాయి. పవన్ సినిమా మినహా, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, బాలకృష్ణలు నటించే భారీ బడ్జెట్ చిత్రాలతో సహా అనేక ప్రాజెక్టులు స్తంభించాయి. 30 శాతం వేతన పెంపు, అదే రోజు చెల్లింపు డిమాండ్ చేస్తూ “నో హైక్, నో షూట్” అనే నినాదంతో కార్మికులు సమ్మెకు దిగారు. పవన్ కళ్యాణ్ మాత్రం సినీ కార్మికుల సమస్యను పట్టించుకోకుండా ముంబై నుంచి కార్మికులను ఇంపోర్ట్ చేసుకొని షూటింగ్ కొనసాగించగా, తమ పొట్ట కొట్టొద్దు అంటూ ఆ సినిమా షూటింగ్‌ను కూడా కార్మికులు అడ్డుకున్నాయి.
30 శాతం పెంపు డిమాండ్‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతలు అసాధ్యమని తేల్చి చెప్పారు. ప్రస్తుత వేతనాలు చెన్నై, కేరళ పరిశ్రమలతో పోలిస్తే ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయని, 30 శాతం పెంపు చిన్న, మధ్య తరగతి నిర్మాతలకు భారమవుతుందని వాదించారు. ఈ దశలోనే ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినీ కార్మిక యూనియన్‌తో సంబంధం లేని వ్యక్తులను షూటింగ్‌లోకి తీసుకునేందుకు నిర్ణయించింది. ఇందుకోసం కొత్త నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నిర్ణయం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆదేశాలకు అనుగుణంగా ఉందని, యూనియన్ సభ్యత్వం కోసం లక్షల రూపాయల సభ్యత్వ ఫీజులు చెల్లించడం కొత్త ప్రతిభకు అడ్డంకిగా ఉందని ఛాంబర్ పేర్కొంది. నిర్మాతల చర్య సినీ కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. సమ్మెను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని కార్మికులు హెచ్చరించారు.
ఈ రోజు ఉదయం 11 గంటలకు లేబర్ కమిషనర్ గంగాధర్‌తో ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కీలక భేటీ జరపనున్నారు. ఈ సమావేశంలో సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. డి. సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, రవిశంకర్ యలమంచిలి వంటి ప్రముఖ నిర్మాతలు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. కార్మికుల డిమాండ్లను సమన్వయపరచడం ద్వారా పరిశ్రమను సాధారణ స్థితికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఫెడరేషన్ సభ్యులు తమ డిమాండ్లకు ఒప్పుకోని నిర్మాతల షూటింగ్‌లకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఈ వివాదం పరిష్కారం కాకపోతే, టాలీవుడ్లో షూటింగ్ షెడ్యూల్స్, విడుదలలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది, ఇది పరిశ్రమకు ఆర్థికంగా భారీ నష్టాన్ని కలిగించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.