తిరుపతి జిల్లాలో హిందూ దేవాలయాల ధ్వంసం సంఘటనలు వరుసగా చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. రెండు రోజుల వ్యవధిలో రెండు ఆలయాలపై దాడి చర్చనీయాంశం కాగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. రెండ్రోజుల క్రితం చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుచానూరు సమీపంలో శ్రీ ఆది వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసం కాగా, తాజాగా తిరుపతి రూరల్ మండలం దామినేడులో నాగాలమ్మ గుడిని టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు జేసీబీలతో కూల్చివేసిన ఘటన స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటనలపై హైందవ సంఘాలు, స్థానిక గ్రామస్తులు నిరసనలు తెలుపుతుండగా, సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై హిందూ ధర్మ పరిరక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుచానూరులో జరిగిన వారాహి అమ్మవారి ఆలయ ధ్వంసం ఘటనలో టీడీపీ నేత కిషోర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జూన్ 9న రాత్రి జేసీబీలతో ఆలయాన్ని కూల్చివేసి, విగ్రహాలను స్వర్ణముఖి నదిలో పడేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకులు నిరసనకు దిగగా, పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారని తెలుస్తోంది. స్థానికులు ఈ ధ్వంసం వెనుక అక్రమ ఇసుక తవ్వకాల మాఫియా, భూ కబ్జాల ఉద్దేశం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైనప్పటికీ, పోలీసుల నిష్క్రియత్వంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి రూరల్ మండలం దామినేడులో నాగాలమ్మ గుడి ధ్వంసం ఘటనలో టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడుపై గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గత పదేళ్లుగా ఆలయం చుట్టూ ఫెన్సింగ్ వేసి భక్తులను అడ్డుకుంటున్న కృష్ణమూర్తి, తాజాగా అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో గుడిని కూల్చి, స్థలాన్ని చదును చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆందోళనకు దిగగారు.
సోషల్ మీడియాలో ఈ సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “సనాతన ధర్మ పరిరక్షకుడు”గా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనలపై స్పందించకపోవడంపై నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. “వారాహి అమ్మవారి ఆలయం కూల్చబడినప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడ?” అంటూ సోషల్ మీడియాలో హైందవ సంఘాలు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.