తిరుపతి శ్రీవారిమెట్టు వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు అందించాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి పెంచారు. రోజుకు కేవలం 3,000 టోకెన్లను మాత్రమే జారీ చేస్తున్నారని, అయితే ఈ టోకెన్లు నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు.
భక్తులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి టోకెన్లు అందడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం దందా జరుగుతోందని, ఇది భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని మండిపడుతున్నారు. సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులకూ టోకెన్లు అందడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భక్తులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ టీటీడీ అధికారులను విజ్ఞప్తి చేశారు. దర్శనం టోకెన్ల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు, పాలక మండలి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.








