అనగనగా ఓ మంత్రి (Minister), ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం విశిష్టతను కాపాడాల్సిందిపోయి.. ప్రాయశ్చిత్తం లేని పాపాలకు పాల్పడుతున్నాడు. ఏమాత్రం భయం, భక్తీ లేకుండా, ఆధ్యాత్మిక క్షేత్రంలో మహాపచారాలు చేస్తున్నాడు. ఇన్నాళ్లూ పొరుగు రాష్ట్రంలో పెట్టిన కామకుంపటిని, ఇప్పుడు నేరుగా తిరుపతికి మార్చాడు. తిరుపతి (Tirupati) ఫైవ్‌స్టార్స్, సెవన్ స్టార్స్ హోటల్స్‌లో తిష్టవేసే సరస శృంగార మంత్రి (Lustful Minister) ఎవరు..? ఆ మంత్రి పక్క గదిలో ఉన్నది ఎవరు..? అనేది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలందరి మదిలో ప్రస్తుతం మెదులుతున్న ఏకైక ప్రశ్న.
బయటపెట్టిన సొంత పార్టీ నేత..
తిరుపతి వేదికగా కూటమి ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి చీకటి బాగోతాన్ని సొంత పార్టీకి చెందిన వ్యక్తి బయటపెట్టడం సంచలనంగా మారింది. టెంపుల్ సిటీలో మంత్రి రాసలీలలు గురించి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి చెందిన అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్ రెడ్డి (NB Sudhakar Reddy) టీడీపీ అనుకూల మీడియాగా ముద్రవేసుకున్న ఏబీఎన్ లైవ్ డిబేట్‌లో ప్యానల్ సభ్యులంతా కూటమి ప్రభుత్వ నేతలు ఉండగానే బయటపెట్టారు. ఇప్పుడీ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరా మంత్రి అని తిరుపతి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఆ పక్క గది ఎవరి కోసం..
ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు వచ్చిన మంత్రి ఇలా తప్పు చేస్తే.. ఎలా అని టీడీపీ నేతే ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. ఆ మంత్రి ఎప్పుడు తిరుపతికి వచ్చినా ఫైవ్‌స్టార్, సెవన్ స్టార్ హోటల్స్‌లో దిగుతారట. ఆయన బస చేసే రూమ్ పక్కనే మరో గది కూడా బుక్ చేస్తారట. ఆ గది ఎవరి కోసం తీసుకుంటారో స్థానిక లీడర్లకు తెలుసని టీడీపీ అధికార ప్రతినిధి వెల్లడించారు. హోటల్‌కు వచ్చి విచ్చలవిడిగా మందు తాగి, పక్కగదిలో సరసాలాటలు ఆడుకొని వెళ్లిపోతారట. ఆ మంత్రి దగ్గర ఒక అమ్మాయి ఉంటుందని, ఆ అమ్మాయిని అనుమతిస్తేనే మంత్రి దర్శనం దొరుకుతుందని.. ఈ వైభోగాలు చూడలేక తనకు తలనొప్పి వచ్చేదని టీడీపీ నేత సుధాకర్‌రెడ్డి మీడియా ఛానల్ లైవ్‌లో చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ తంతు స్థానిక నాయకులకు తెలిసి నవ్వుకుంటున్నా, నిత్యం శ్రీవెంకటేశ్వరస్వామిని కొలిచే అమాయక తిరుపతి ప్రజలు మాత్రం ఎవరా నేత అని ప్రశ్నలు వేసుకుంటున్నారు.
ఒకరిని మించి మరొకరు..
బయటకు ఆడవారిని గౌరవించే పార్టీ అని ప్రచారం చేసుకుంటున్నా.. అందుకు విరుద్ధంగా టీడీపీ నేతల చేష్టలున్నాయి. ఇదే తిరుపతి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హోటల్ గదిలో మహిళలతో అసభ్యకర పనులు చేస్తున్న వీడియోలు బయటపడిన అభాసుపాలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఆదిమూలం అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డ్యామేజీ కంట్రోల్ కోసం అధిష్టానం అతన్ని సస్పెండ్ చేసింది. ఇటీవల గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళలతో వీడియో కాల్స్ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. మొదట ఇదంతా ఏఐ, డీప్‌ఫేక్ వీడియోలని కొట్టిపారేసినా, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఎమ్మెల్యేల తీరునే వేలెత్తి చూపించాయి. ఇప్పుడు తిరుపతిలో మంత్రి వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిందంటున్నారు ఆ పార్టీ నేతలు.







