డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా తిరుపతిలో జరిగిన దాడిపై మేయర్ శిరీష భావోద్వేగానికి గురయ్యారు. బస్సులో ఉండగానే రాళ్లతో దాడి జరిగిందని, తమ ప్రాణాలకు రక్షణేది అంటూ ప్రశ్నించారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
‘కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?. మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు. మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు. మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి. మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం’ అని మేయర్ శిరీష అన్నారు.
దాడిపై స్పందించిన ఎంపీ గురుమూర్తి
డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ, జనసేన రాజకీయ వికృత క్రీడ మొదలుపెట్టిందని తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై న్యాయపోరాటం చేస్తామని వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. ఎన్నికలో పాల్గొనేందుకు బస్సులో వెళ్తుండగా కూటమి నేతలు మార్గమధ్యలో బస్సును అడ్డుకొని రాళ్లతో దాడి చేశారన్నారు. టీడీపీ నేత శంకర్ మరికొందరితో వచ్చి నలుగురు వైసీపీ కార్పోరేటర్లు బలవంతంగా లాక్కుని వెళ్లారని చెప్పారు. బలవంతంగా తీసుకెళ్లిన కార్పోరేటర్లను అప్పగించే వరకు మేం ఎన్నికలో పాల్గొనమని ఎంపీ గురుమూర్తి అన్నారు.








