తిరుపతి ఘటనపై భక్తులకు క్షమాపణలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీటీడీ పాలక మండలి, అధికారులపై తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం మండలం కుమారపురంలో శ్రీకృష్ణ ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులాల షెడ్లను వర్చువల్‌గా పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తూ.. టీటీడీ తొక్కిసలాట ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో తొక్కిసలాట సందర్భంగా ప్రజల సంక్రాంతి ఆనందం భగ్నం కావడం బాధాకరమని, ఈ ఘటనకు సంబంధించిన బాధ్యత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరియు జేఈఓ వెంకయ్య చౌదరి తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా తప్పుజరిగితే తమ అందరి సమష్టి బాధ్యతని, అందుకే తిరుపతి ఘటనపై క్షమాపణలు చెప్పానని పవన్ తెలిపారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈఓ వెంకయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకని ప్రశ్నించారు. అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా తప్పు చేస్తే శిక్షకు సిద్ధమని పవన్ ఇప్పటికే అనేకసార్లు చెప్పినట్లు స్పష్టం చేశారు.
టిటిడిపై తీవ్ర విమర్శలు
తిరుపతి ఘటన నేపథ్యంలో టీటీడీ పాలనలో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ శ్రీవారి భక్తులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పినప్పటికీ, టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో స్థాయి అధికారుల మాత్రం నోరు మెదపలేదు. దీంతో పవన్ కళ్యాణ్ వారిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.