పోలీస్ (Police) ఉన్నతాధికారిపై తిరుపతి (Tirupati)లోని ఓ హోటల్ (Hotel) సిబ్బంది దాడి కలకలం రేపింది. అన్నమయ్య సర్కిల్ (Annamayya Circle)సమీపంలోని ఫైవ్ స్టార్ చికెన్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి హోటల్‌కు వచ్చిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రామ్మోహన్ (ASI Rammohan)కు, ఆయన ఇచ్చిన ఆర్డర్‌కు బదులుగా వేరే వంటకం సర్వర్ అందించాడు. ఈ విషయంపై ఏఎస్ఐ వివరణ అడగగా సిబ్బంది దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దారి తీసింది.
దుర్భాషలు, దాడి
వాగ్వాదం తీవ్రరూపం దాల్చి సిబ్బంది ఏఎస్ఐ కుటుంబంపై దుర్భాషలాడి, దాడి చేసినట్లు సమాచారం. అయితే ఏఎస్ఐపై దాడి సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గిరిబాబు ఘటన స్థలానికి చేరుకోవడంతో, ఆయనపైనా సిబ్బంది దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితుడు ఏఎస్ఐ రామ్మోహన్ ఫిర్యాదు చేయడంతో, ఈస్ట్ పోలీసులు హోటల్ సిబ్బందిలో నలుగురిపై కేసు నమోదు చేశారు.








