తిరుపతిలో మహాపచారం.. ఆల‌య గోపురంపై మందుబాబు హ‌ల్‌చ‌ల్‌

తిరుపతిలో మహాపచారం.. ఆల‌య గోపురంపై మందుబాబు హ‌ల్‌చ‌ల్‌

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ఖ్యాత గాంచిన తిరుప‌తి న‌గ‌రంలో మ‌హా అప‌చారం చోటుచేసుకుంది. తిరుపతి పవిత్రతను కుదిపేసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి ఆలయ గోపురంపైకి ఎక్కి వీరంగం సృష్టించడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. ఏకాంత సేవ అనంతరం ఆలయ గేట్లు మూసిన తర్వాత కూడా ఆ వ్యక్తి లోపలికి ప్రవేశించడమే కాకుండా, గోపురంపైకి ఎక్కి హల్‌చల్ చేయడం టీటీడీ విజిలెన్స్, భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని మరోసారి బయటపెట్టింది.

మద్యం మత్తులో ఆలయ గోపురంపైకి ఎక్కిన వ్యక్తి అక్కడ ఉన్న రెండు కలశాలను పాక్షికంగా ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. గోపురంపై నుంచి నినాదాలు చేస్తూ, “90 ఎంఎల్‌ మద్యం ఇస్తేనే కిందకి దిగుతాను” అంటూ డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులు భయాందోళనకు గురవగా, వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.

దాదాపు మూడు గంటల పాటు శ్రమించిన అనంతరం పోలీసులు గోపురంపైకి ఎక్కి ఆ వ్యక్తిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. తాళ్లతో బంధించి కిందకు దింపిన అనంతరం అతడిని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఆలయ పవిత్రతకు భంగం కలిగిందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఆలయ గోపురం వంటి అత్యంత సున్నితమైన ప్రాంతానికి ఒక వ్యక్తి చేరుకోవడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం రాలేదు. తిరుపతిలో పవిత్రతను కాపాడడంలో జరుగుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని భ‌క్తులు ఆగ్ర‌హిస్తున్నారు.

ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయంలో డిజిటల్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతోనే పాలక మండలి సభ్యులు దర్శనానికి వెళ్లిన ఘటన, నామమాత్రపు తనిఖీలు, భద్రతా లోపాలు ఇప్పటికే వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు గోవిందరాజస్వామి ఆలయంలో మద్యం మత్తులో వ్యక్తి గోపురంపైకి ఎక్కిన ఘటనతో టిటిడి భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. పవిత్ర క్షేత్రాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment