తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దళిత విద్యార్థి నోట్లో మూ** పోసి దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్న జేమ్స్ రౌడీషీటర్ రూపేష్, చోటా బ్లేడ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, హత్యాయత్నం చేసిన ఘటన సంచలనంగా మారింది. కాగా, రౌడీ షీటర్ రూపేష్ అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జేమ్స్ ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఘటన వివరాలు
ఈ సందర్భంగా దాడికి గురైన జేమ్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జేమ్స్ వివరాల ప్రకారం.. రౌడీషీటర్ రూపేష్ నేతృత్వంలోని చోటా బ్లేడ్ గ్యాంగ్ తనను కిడ్నాప్ చేసి, ఒకటిన్నర రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసిందని వాపోయాడు. ఈ దాడిలో తనను కులం పేరుతో దూషించడంతో పాటు, “ఒరేయ్ అంబేద్కర్ జాతి నా కొడుకా” అంటూ అవమానించినట్లు ఆయన తెలిపాడు. రౌడీషీటర్ తన నోట్లో మూత్రం పోసి, శారీరకంగా, మానసికంగా వేధించినట్లు జేమ్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడి తనపై కుల ద్వేషంతో జరిగిన హత్యాయత్నమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు.
పోలీసుల వైఖరిపై విమర్శలు
ఈ ఘటనపై తిరుచానూరు పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసినట్లు జేమ్స్ ఆరోపించాడు. నిందితులపై హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ, పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. “నాకు న్యాయం జరగకపోతే, ఆత్మహత్యే శరణ్యం” అంటూ జేమ్స్ కన్నీరు పెట్టుకున్నాడు. కాగా, దాడి చేసిన రౌడీ షీటర్ రూపేష్ అధికారంలోకి కూటమి పార్టీకి చెందిన వ్యక్తిగా స్థానికులు ఆరోపిస్తున్నారు.
సమాజంలో ఆందోళన
ఈ దాడిని స్థానిక దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ అండతో రెచ్చిపోయిన రౌడీ షీటర్ రూపేష్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తిరుపతిలో దారుణం.. దళిత విద్యార్థి జేమ్స్ కిడ్నాప్, ఆపై హత్యాయత్నం
— Telugu Feed (@Telugufeedsite) May 17, 2025
మూత్రం నోట్లో పోసి ఒకటిన్నర రోజు చిత్రహింసలు పెట్టారని ఆరోపణ
తనను చంపేందుకు అధికార కూటమికి చెందిన రౌడీషీటర్ రూపేష్, చోటా బ్లేడ్ గ్యాంగ్ ప్రయత్నించారని వెల్లడి #AndhraPradesh #Tirupati #APPolice pic.twitter.com/0MMUkR5wfz








