పవిత్రమైన తిరుపతి పట్టణంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ప్రధాన కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని మంగళవారం ఉదయం గమనించిన హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
బజరంగ్ దళ్ ఆందోళన
ఈ ఘటనపై బజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అన్నమయ్య విగ్రహ ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. “ఇది హిందువుల మనోభావాలకు తీవ్ర దెబ్బ” అంటూ వారు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపిన బజరంగ్ దళ్ కార్యకర్తలు ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు.
పోలీసుల హామీ
రేపు క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులను పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటన తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.