తిరుమల వేంకటేశ్వర స్వామి (Tirumala Venkateswara Swami) సన్నిధిలో నిర్మించిన వెయ్యికాళ్ల మండపానికి (Thousand Pillar Mandapam) ఎంతో చరిత్ర, విశిష్టత ఉంది. శ్రీవారి భక్తులకు, టీటీడీ(TTD)కి వివిధ రకాలుగా సేవలందించిన ఈ మండపాన్ని పలు కారణాలతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం (TDP Government) నేలమట్టం చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) ఈ మండప పునర్నిర్మాణానికి బీజం వేసినప్పటికీ, కోర్టు కేసుల వల్ల మళ్లీ నిర్మాణం నిలిచిపోయింది. ఈ మండపం కూల్చివేతను తీవ్రంగా వ్యతిరేకించిన త్రిదండి చినజీయర్ స్వామి (Tridandi Chinna Jeeyar Swami) దానిని పునర్నిర్మించే వరకు శ్రీవారిని దర్శించుకోనని అప్పట్లో శపథం చేసిన సంచలనాత్మక వెయ్యికాళ్ల మండపం వివాదంపై ప్రత్యేక కథనం.

తిరుమల కొండపై ఉన్న శ్రీవారి ఆలయాన్ని 3వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఎందరో రాజులు, వారి సామంతులు అంచెలంచెలుగా నిర్మించారు. ఆలయం ఎదుట ఉన్న వెయ్యికాళ్ల మండపాన్ని 1472లో విజయనగర సామ్రాజ్యానికి రాజు సాళువ నరసింహరాయలు దాయాది అయిన సాళువ మల్లయ్యదేవ మహారాజు నిర్మించాడు. మొదట్లో శ్రీవారు మాడవీధులలో ఊరేగేటప్పుడు మండపానికి వేంచేసేవారు. అక్కడ ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించిన తర్వాత ఇతర కార్యక్రమాలు జరిగేవి. తర్వాతి కాలంలో ఈ మండపం భక్తులకు ఆసరాగా మారింది. టీటీడీ ఏర్పడిన తర్వాత లడ్డూ కౌంటర్లు, బ్యాంకు కౌంటర్లు, ఎంప్లాయీస్ క్యాంటిన్, మ్యూజియం, పురోహిత సంఘం, పోలీసు స్టేషన్, దుకాణాలు వంటివి ఈ మండపంలోనే ఏర్పాటు చేసింది.

బ్రహ్మోత్సవాల నిర్వాహణ లోపం, ముందస్తు ప్రణాళికలు ఏమీ లేకుండా చేయడంతో 1974 శ్రీవారి బ్రహ్మోత్సవాల రథోత్సవ సమయంలో తొక్కిసలాట జరిగింది. జరిగిన తొక్కిసలాట నెపాన్ని మెల్లగా వెయ్యి కాళ్ల మండపంపై నెట్టేశారని ఇప్పటికీ అంటుంటారు. అయినా, మండప తొలగింపు సాధ్యపడలేదు. 2002 చంద్రబాబు అధికారంలో ఉండగా, బ్రహ్మోత్సవాల్లో మాడవీధుల్లో మరోసారి తోపులాట జరిగింది. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈసారి కూడా భక్తుల సంఖ్యను ముందస్తు అంచనా వేయకుండా జరిగిన నిర్వాహణ లోపాన్ని పరిష్కరించకుండా వెయ్యి కాళ్ల మండపంపైకి తోసేశారు. దీంతో మరోసారి వెయ్యికాళ్ల మండపం తొలగింపు తెరపైకి వచ్చింది.

2002 డిసెంబర్ 28న జరిగిన పాలకమండలి సమావేశంలో వెయ్యికాళ్ల మండపాన్ని మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. 2003 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హయాంలో ఏకంగా తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇలా దాదాపు ఏడాదిపాటు అంచెలంచెలుగా వెయ్యి కాళ్ల మండపాన్ని నేలమట్టం చేశారు. అయితే నాడు ఈ మండపాన్ని కూల్చడాన్ని చినజీయర్ స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు ఎవరి మాటా లెక్కపెట్టలేదు, వెనక్కు తగ్గలేదు. వెయ్యి కాళ్ల మండపాన్ని పూర్తిగా తొలగించి చదును చేశారు. దీంతో చినజీయర్ స్వామి వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించే వరకు తన ఇష్టదైవమైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనని చంద్రబాబు ప్రభుత్వంపై శపథం చేశారు.

మండపం కూల్చివేత తర్వాత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో మండప పునర్నిర్మాణానికి చినజీయర్ స్వామి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఎంతో విశిష్టత కలిగిన పురాతన కట్టడాన్ని కూల్చిన పాపం తగిలే చంద్రబాబు ఓడిపోయారని అప్పట్లో అనుకున్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సూచనలతో వెయ్యి కాళ్ల మండపం స్థానంలో 200 స్తంభాలతో మరో మణిమండపం నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. కొత్త మండప నిర్మాణంపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో పనులు ఆగిపోయాయి. తాను కాకుండా మరొకరు నిర్మిస్తే తనకు భంగపాటు తప్పదని, అప్పట్లో చంద్రబాబే కేసులు వేయించాడని ఆరోపణలు కూడా వచ్చాయి.

తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ సూచనల మేరకు మహా మణిమండపం పేరుతో నారాయణగిరి గార్డెన్లో తిరిగి మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అయితే, నారాయణగిరి గార్డెన్లో మండపం నిర్మించరాదంటూ హైదరాబాద్కి చెందిన కిశోర్ స్వామి, లక్ష్మీనాధాచార్యులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో మహా మణిమండప నిర్మాణానికి మళ్లీ బ్రేక్ పడింది. దీంతో దశాబ్దన్నర గడిచినా వెయ్యి కాళ్ల మండపానికి పునాది రాయి కూడా వేయకపోవడంతో చినజీయర్ స్వామి తన శపథాన్ని వీడి 2017లో తిరుమల కొండకు చేరి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో చంద్రబాబు దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు.

వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చి 22 వసంతాలైనా మండప పునర్మిర్మాణం అడుగైనా ముందుకు కదల్లేదు. మండపం కూల్చివేతకు ప్రధాన కారకుడైన చంద్రబాబు ఇప్పుడు అధికారంలో ఉన్నా.. ఆలయ కట్టడానికి అడుగులు ముందుకు వేయడం లేదు. దీంతో ఏళ్లకేళ్లు గడిచినా శ్రీవారి వెయ్యి కాళ్ల మండపం కూల్చివేత పాపం చంద్రబాబు మోస్తూనే ఉన్నారు.








