తిరుమల లడ్డూపై త‌ప్పుడు రాత‌లకు కఠిన చ‌ర్య‌లు – హైకోర్టు హెచ్చరిక

తిరుమల లడ్డూపై త‌ప్పుడు రాత‌లకు కఠిన చ‌ర్య‌లు - హైకోర్టు హెచ్చరిక

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై పబ్లిష్‌ అయ్యే వార్తా కథనాలు, సోషల్‌ మీడియా పోస్టులపై తగిన జాగ్రత్తలు పాటించాలని, లేదంటే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించిన తప్పుడు కథనాలు ప్రచురిస్తే, సంబంధిత మీడియా సంస్థలు మరియు వ్యక్తులు చట్టపరమైన చ‌ర్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. వైసీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.

తిరుమల లడ్డూ వివాదంలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా కథనాలు ప్రచురించారని పేర్కొంటూ, అవి తక్షణమే తొలగించాలని కోరుతూ వైవీ సుబ్బారెడ్డి రూ.10 కోట్ల పరిహారానికి ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారించారు. వాదనలు విన్న అనంతరం, ఇప్పటికే ప్రచురితమైన కథనాలపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.

అయితే, కథనాలపై తక్షణ ఇంటెరిం ఇంజంక్షన్ విధించాలని కోరిన వినతిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాద వివాదంపై సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో, కొన్ని మీడియా సంస్థలు కల్పిత కథనాలు ప్రచురిస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు మీడియాకు మరోసారి కఠిన హెచ్చరిక చేసింది. తిరుమల లడ్డూ వ్యవహారం గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు పరిధిలోకి వస్తుందని, నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇష్టారాజ్యంగా తప్పుడు కథనాలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలని హైకోర్టు తేల్చి చెప్పింది.

Join WhatsApp

Join Now

Leave a Comment