కూటమి (Coalition) ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ (NRI) ల ఆస్తులకు, సీనియర్ సిటిజన్ల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఎన్ఆర్ఐ జనసేనికుడు, తిరుపతి వాసి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఫ్లకార్డులు (Placards) ప్రదర్శిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచానూరు (Tiruchanur) లోని తన భూమిని కబ్జా రాయుళ్లు (Land Grabbers) ఆక్రమించుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లు రూపాయల విలువైన భూములను ఆక్రమిస్తూ, సెటిల్‌మెంట్ పేరుతో బాధితులపై ఒత్తిడిలు తెస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎన్ఆర్ఐ జనసైనికుడి (Janasainikuḍu) వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్తి, ప్రాణ రక్షణ..
సమస్య ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్తాం.. కానీ, పోలీసులతో సమస్య అయితే జనానికి దిక్కెవరు అని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఎన్ఆర్ఐ జనసైనికుడు రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో పార్టీల కోసం శ్రమించిన కార్యకర్తల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేదా.. అని ప్రశ్నించారు. తమలా ఎంతోమంది బాధితులు ఆస్తులు పోగొట్టుకుంటున్నారని, పోలీసులే దగ్గరుండి భూకబ్జాల సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్నారు. తమకు పోలీసుల వెనుక ఉన్న గూండాల నుంచి ఆస్తి (Property), ప్రాణ రక్షణ (Life Protection) కల్పించాలని ఎన్ఆర్ఐ జనసైనికుడు విజ్ఙప్తి చేశారు.
నా భూమిని ఆక్రమించారు..
ఈ పరిస్థితిని ఎన్‌ఆర్‌ఐ రాజేంద్రప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక వీడియోను సైతం విడుదల చేశారు. తమ సొంత స్థలంలో నిర్మాణాలు చేస్తుంటే రాత్రికి రాత్రి గూండాలను పంపించి కూల్చివేతలను చేపట్టారు. సీఐ సునీల్ కుమార్ (CI Sunil Kumar) ఇవన్నీ దగ్గరుండి నడిపిస్తున్నారని రాజేంద్రప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. తనకున్న భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేసినా, పోలీసులు స్పందించడంలేదని ఆరోపిస్తున్నారు. తన తండ్రి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అని, నాలుగు సార్లు ఎస్పీని కలిసినా తిరుచానూరు సీఐ పట్టించుకోలేదని వాపోయారు. ఎఫ్ఐఆర్ (FRI) కూడా నమోదు చేయలేని దారుణమైన పరిస్థితి ఏపీలో ఏర్పడిందని, టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కనిపిస్తుందన్నారు. ఆస్ట్రేలియాలోని టీడీపీ-జనసేన (TDP-Jana Sena) టీమ్‌పై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తే ఒక చిన్న ఎఫ్ఐఆర్ నామమాత్రంగా రెండు సెక్షన్లు పెట్టి నమోదు చేశారని తెలిపారు.
చంపేస్తామని మా నాన్నను బెదిరించారు
‘కేసులు పెట్టిన తరువాత ఎవరైనా భయపడుతారు గానీ, రాజా అనే వ్యక్తి మరింతగా రెచ్చిపోయి 20 మంది ఆడవారిని, మగవారిని తీసుకువచ్చి మిమ్మల్ని చంపేస్తాం అని మా నాన్నను బెదిరించారు, మీకు ఎవరు దిక్కు.. నా వెనకాల 8 మంది పవర్ ఫుల్ వ్యక్తులు ఉన్నారని బెదిరింపులకు గురిచేస్తున్నాడు’ అని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. కోటి (Crore) ఇస్తే సెటిల్‌మెంట్ (Settlement) చేసుకుందామని మధ్యలో ఉన్న వ్యక్తుల ద్వారా పోలీసులే సందేశాలు పంపిస్తున్నారని, ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులు ఆశించడం ఎంత వరకు సబబు అని కూటమి ప్రభుత్వాన్ని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.
ప్రవాసాంధ్రుల భూములకు రక్షణ ఉందా?
ఏపీలో బీహార్ (Bihar) తరహా భూ దోపిడీ (Land Looting) జరుగుతోందని, రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవాసాంధ్రుల భూములకు రక్షణ లేకుండా పోయిందని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ఇలాంటి అనుభవం ఎదుర్కొంటున్నామని రాజేంద్రప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు.